బూచేపల్లికే ప్రకాశం బాధ్యతలు
ప్రకాశం న్యూస్, దర్శి: వైఎస్సార్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని నియమిస్తున్నట్లు వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైకాపాకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడంతో జిల్లా వైకాపా నేతలు, ఎమ్మెల్యేలతో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నూతన వైకాపా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని నియమించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.
బూచేపల్లి రాజకీయ నేపథ్యం.. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2005లో శివప్రసాద్‌రెడ్డి చీమకుర్తి ఎంపీపీగా పనిచేశారు. అనంతరం 2009లో దర్శి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైకాపా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2024లో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తల్లి వెంకాయమ్మ ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.
విధేయతకే పీఠం.. బూచేపల్లి కుటుంబం వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయులు. రాజకీయంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా ఏనాడు వైఎస్ కుటుంబాన్ని వీడలేదు. బూచేపల్లి సుబ్బారెడ్డి, వైఎస్సార్ అడుగుజాడల్లో నడిస్తే, వైఎస్ జగన్ బాటలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సాగుతున్నారు. శివప్రసాద్‌రెడ్డిపై జగన్ సైతం సోదర ప్రేమను చూపుతుంటారు. పలు బహిరంగ వేదికల్లోనూ అది ప్రస్ఫుటమవుతోంది. జిల్లాలో బాలినేని తర్వాత ఆ స్థాయిలో జగన్ దగ్గర పలుకుబడి ఉన్న నేతగా బూచేపల్లికి పేరుంది. ప్రస్తుతం బాలినేని పార్టీని వీడటంతో జిల్లా పార్టీ పగ్గాలు అందరూ ఊహించినట్లుగా వైఎస్ కుటుంబానికి వీర విధేయులైన బూచేపల్లికే దక్కాయి. జిల్లా పెద్దన్న పాత్ర పోషించడంలో బూచేపల్లికి అన్నీ అర్హతలు ఉన్నాయన్నది వాస్తవం.
గేర్ మార్చాల్సిన తరుణమిదే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దర్శి నియోజకవర్గంలో పరిస్థితులు బూచేపల్లికి ఇబ్బందిగా మారాయి. జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు రాజకీయం కాస్త దూకుడు పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారంలో తన ప్రతిపక్ష నేతలను దీటుగా ఎదుర్కోవాల్సిన గురుతర బాధ్యత బూచేపల్లిపై ఉంది. మెతక వైఖరి విడనాడి దర్శి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా వైకాపా కేడర్‌ను మరింత ఉత్సాహపరుస్తూ పార్టీ కార్యకలాపాలను నిర్వహించాల్సిన అవసరముంది.
వైకాపా అధినేత జగన్ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలో పార్టీ పటిష్ఠానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్ శివన్నా!!
-వవెరా, జర్నలిస్ట్