జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని
ప్రకాశం న్యూస్, మార్కాపురం: ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపాకు ఇటీవల రాజీనామా చేసిన విషయం విదితమే. గురువారం సాయంత్రం 5 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాలినేనితో పాటు వైకాపాకు చెందిన గోలి తిరుపతిరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, గంటా రామానాయుడు జనసేన పార్టీలో చేరారు. అనంతరం పవన్ కల్యాణ్, ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్‌తో మాజీ మంత్రి బాలినేని కాసేపు ముచ్చటించారు.
అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా.. జనసేన పార్టీలో చేరిన అనంతరం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేశానని, తనకు పదవులపై ఆకాంక్ష లేదన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి, ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు. తన వల్ల కూటమి మధ్య వివాదాలు తలెత్తవన్నారు. జనసేన పార్టీలో మొదటి నుంచి ఉన్న వారితో పాటు కొత్తవారిని సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జిల్లాకు చెందిన జనసేన నేతలు రియాజ్, అరుణ, బాల నాగేంద్ర యాదవ్‌తో కలిసి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని బాలినేని తెలిపారు.