అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం న్యూస్, దర్శి: దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఉల్లగళ్లు, దర్శి టౌన్‌లోని 16వ వార్డు, దర్శి మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, తెదేపా యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, వారితో పాటు ముండ్లమూరు మండల MPDO జనార్దన్, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్, దర్శి మండల MPDO కృష్ణమూర్తి, దర్శి మున్సిపల్ ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ముండ్లమూరు మండల మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, రెవెన్యూ, సచివాలయం సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత విద్యాశాఖ లోకేశ్ ప్రజల కోసం నిరంతరం పరితపిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు పెంచిన పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో అందరికీ అర్థమవుతుందన్నారు. ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతున్న సందర్భంలో 90 శాతం మంది ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం ఇలా సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా మార్చే సత్తా మన కూటమి ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేస్తున్నానన్నారు. తొలి ప్రయత్నంగా మెగా జాబ్ మేళా ద్వారా దాదాపు 600 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. మెగా మెడికల్ క్యాంపును నిర్వహించి ఐదు వేల మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ప్రతి నెల, ప్రతి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రమైన దొనకొండలో ఈనెల ఆరో తేదీన మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.