మార్కాపురం చెరువు కట్టను పరిశీలించిన వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో మార్కాపురం చెరువు కట్టను ఆదివారం మార్కాపురం నియోజకవర్గ వైకాపా నేత, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఉమ్మడి జిల్లాల రైతు విభాగం నాయకులు ఉడుముల కోటిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుకు వరద నీరు చేరుతోందని, ఈ క్రమంలో చెరువు కట్ట బలహీనంగా ఉందన్నారు. అల్పపీడనాల ప్రభావంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ తరుణంలో జలవనరుల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు చెరువు కట్టను పరిశీలించి, వెంటనే కట్టను పటిష్ఠ పరచాలన్నారు. చాలా చోట్ల చెరువు కట్టకు గండ్లు పడే ప్రమాదముందన్నారు. ఒకవేళ వర్షాలు అధికమై, ఇప్పటికే బలహీనంగా ఉన్న కట్ట తెగితే మరో బుడమేరు ఘటనను చూడాల్సివస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 500 ఎకరాల మేర ఉన్న చెరువును పలువురు ఆక్రమణదారులు సుమారు 250 ఎకరాల మేర ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అధికారులు, పాలకులు ఇప్పటికైనా స్పందించి ఆక్రమణదారుల నుంచి చెరువును కాపాడాలని ఆయన కోరారు. వెంటనే చెరువు కట్టపై ఉన్న ముళ్ల పొదలను తొలగించాలని సూచించారు. చెరువు కట్టను సైతం పటిష్ట పరచాలని అధికారులను ఉడుముల కోటిరెడ్డి కోరారు. పాలకులు సైతం స్పందించి చెరువు కట్టను ట్యాంక్ బండ్ రీతిలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలన్నారు.
చెరువు కట్టపై నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి సైతం గోతులమయమైందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఉడుముల కోటిరెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం ఆయన పట్టణంలోని రేడియో స్టేషన్ సమీపంలోని గుండ్లకమ్మ నుంచి చెరువుకు నీరు పారే కాల్వను పరిశీలించారు. కాల్వలో ముళ్ల పొదలు, చెత్తాచెదారం వల్ల నీరు వేగంగా పారడం లేదని పేర్కొన్నారు. కాల్వపై నిర్మించిన వంతెన సైతం శిథిలావస్థకు చేరిందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాల్వను శుభ్రం చేయాలని కోరారు. వంతెనకు సైతం మరమ్మతులు చేయాలని ఉడుముల కోటిరెడ్డి పేర్కొన్నారు.