దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి ఐటీ మంత్రి లోకేశ్ అంగీకారం: గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం న్యూస్, దర్శి: దర్శి పట్టణంలో డిగ్రీ కాలేజీ అవసరం ఉందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఐటీ శాఖమాత్యులు నారా లోకేశ్‌కు విన్నవించారు. ఉండవల్లిలో సోమవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై లోకేశ్త సుదీర్ఘంగా చర్చించారు. నాడు యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టాలని తెలియజేశారు. కురిచేడు రోడ్డులో డిగ్రీ కాలేజీకి అవసరమైన ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించామని తెలియజేశారు. వైకాపా హయాంలో డిగ్రీ కాలేజీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో డిగ్రీ కాలేజీ అవసరాన్ని వివరించారు. వెనుకబడిన ప్రాంతం ఐదు మండలాలలో జూనియర్ కాలేజీలతో ఉన్న ఈ ప్రాంతానికి ఉన్నత విద్య డిగ్రీ సాంకేతిక విద్యలో లేకపోవడం వల్ల ఒంగోలు ఇతర ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వివరించారు. దీనిపై ఐటీ శాఖ మాత్యులు లోకేశ్ సానుకూలంగా స్పందించి వెంటనే అంచనాలు రూపొందించి పంపించాలని, త్వరలో దర్శి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ కాలేజీ కల నెరవేరుస్తానని హామీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మి వివరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైనా చర్చించారు. అన్న క్యాంటీన్, కోల్డ్ స్టోరేజ్, టీటీడీ కల్యాణ మండప నిర్మాణం, రోడ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు, గురుకుల ప్రాథమిక పాఠశాలలో అవసరమైన వసతులపై సుదీర్ఘంగా చర్చించి ప్రభుత్వపరంగా సహకరించాలని కోరారు. దీనిపై లోకేశ్ సానుకూలంగా స్పందించి కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం అని ప్రజల అవసరాలు తీర్చడమే మన లక్ష్యమని ఆయన వివరించారన్నారు. ముఖ్యంగా విద్యా పరంగా డిగ్రీ కాలేజీ నిర్మాణానికి హామీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల పరంగా సభ్యత్వ నమోదులోనూ ప్రభుత్వ పథకాల అమలు పనితీరుపై దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మీ చేస్తున్న కృషిని లోకేశ్ అభినందించారు. ఆమె భవిష్యత్తుకు భరోసా తనదని, కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు, పార్టీని అభివృద్ధి చేసేందుకు లక్ష్మి చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో తెదేపా కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, నిర్మాణ బాధ్యత తాను తీసుకుంటామని డాక్టర్ లక్ష్మి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా జిల్లా స్థాయిలో ముందు కార్యాలయాలు ఏర్పాటు చేశాక నియోజకవర్గ స్థాయిలో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుందామని లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లోకేశ్‌తో జరిగిన భేటీ ఎంతో సంతృప్తిగా ఉందని, దర్శి అభివృద్ధికి లోకేశ్ ఇచ్చిన హామీల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.