విలువలతో కూడిన రాజకీయ నేత దామచర్ల: గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం న్యూస్, దర్శి: ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పని చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత దామచర్ల ఆంజనేయులు రాజకీయాల్లో అందరికీ ఆదర్శనీయులని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఆదివారం ఆమె మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పునాయుడుపాలెం సర్పంచిగా 1962లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దామచర్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో పార్టీలో చేరి 1983లో పీడీసీసీ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశారన్నారు. 1990లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన తీరును ఇప్పటికీ తనలాంటి యువ రాజకీయ నేతలకు పాఠాలుగా చెబుతారని వివరించారు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవాదాయ శాఖ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తిని కొనసాగించడంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, యువ నాయకుడు దామచర్ల సత్య ముందున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుని, వివాదరహితుడుగా ప్రజలకు సేవ చేయడమే ఆయన లక్ష్యంగా పనిచేశారని చెప్పారు. ఆయన చరిత్ర ఈనాటి రాజకీయ నాయకులకు ఒక పాఠంగా తీసుకోవాలన్నారు. తమ తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు, దామచర్ల ఆంజనేయులు నాడు సహచర మంత్రివర్యులుగా పని చేశారన్నారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో దామచర్ల ఆంజనేయులు పనిచేసి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు ప్రాంతంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా దామచర్ల జనార్ధన్ కష్టకాలంలో పార్టీని, కార్యకర్తలకు అండగా ఉన్న నాయకుడు అని కొనియాడారు. సత్య యువ కెరటం, తన లాంటి యువతకు సత్యన్న స్ఫూర్తి ఎంతో మేలు చేస్తుందన్నారు.