కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చలు
ప్రకాశం న్యూస్, దర్శి: మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన డ్రోన్ సమ్మిట్‌లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఆమె దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపై చర్చించారు. విమానాశ్రయ నిర్మాణం సాధ్యాసాధ్యాలను వివరించారు. దొనకొండ వెనుకబడిన ప్రాంతమని, వలసలను నివారించే లక్ష్యంతో విమానాశ్రయానికి కేటాయించిన 354 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని డాక్టర్ లక్ష్మి మంత్రికి వివరించారు. ముఖ్యంగా పౌర విమానయాన అనుబంధ కేంద్రంగా వెనుకబడిన ఈ ప్రాంతాన్ని వినియోగించుకోవాలని, తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించి యువతకు ఉపాధి కల్పించాలని ఆమె కోరారు. దర్శి ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఉన్న దొనకొండ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మాత్యులు లోకేశ్ బాబు ఈ మేరకు దర్శి ప్రాంత ప్రజల ఆకాంక్షలకనుగుణంగా దొనకొండ పారిశ్రామిక వాడ అభివృద్ధికి మాట ఇచ్చామని ఆమె వివరించారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అధికారులతో సమీక్షించి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డితో పరిశీలించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. వెనుకబడిన దొనకొండ ప్రాంతం నుంచి ప్రతి ఏడాది వందలాది మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వలసలు వెళ్లి ఉపాధి పొందుతున్నారని వారికి జీవనోపాధి కల్పించే లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి అవసరమని అందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించిన సంపూర్ణ నివేదికతో అధికారులతో కలిసి రావాలని కోరారు. దొనకొండ ప్రాంత అభివృద్ధికి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎలా చేస్తే బాగుంటుంది, ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందో అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని, త్వరలో ఇందుకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహిద్దామని తెలిపినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.