ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో మార్పులు జరగాలి: గిద్దలూరు జేఎస్పీ ఇన్‌ఛార్జ్ బెల్లంకొండ
ప్రకాశం న్యూస్, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని అధిష్ఠానం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గిద్దలూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు అన్నారు. ఒంగోలులో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజలకు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం చేసేలా అధిష్ఠానం దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను మార్పు చేయాల్సిన ఉందన్నారు. 2024 ఎన్నికలలో దర్శి, గిద్దలూరు నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయాల్సి ఉన్నా అధిష్ఠానానికి వెళ్లిన తప్పుడు నివేదిక వల్ల అది సాధ్యపడలేదన్నారు. జిల్లాలో జనసేన కార్యకర్తలకు, నాయకులకు సరైన ప్రాధాన్యత లభించడం ఆరోపించారు. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లలేదని,కేవలం అధికారంలోకి వచ్చి 4 నెలలే అయిందని, రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయని ఓపికతో ఉన్నామన్నారు. జనసేన పార్టీ సహాయ సహకారాలతో విజయం సాధించిన ఎమ్మెల్యేలు జనసేన పార్టీ కార్యకర్తలను, నాయకులను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంకొండ సాయిబాబు అన్నారు. అతి త్వరలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి జిల్లా పరిస్థితిని వివరిస్తామన్నారు. జిల్లాలో సమర్థవంతమైన నాయకుడిని ఇన్‌ఛార్జులుగా పెట్టడమే కాకుండా గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని సాయిబాబు అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో కలిసి నడుస్తున్నామని, జిల్లా ఇన్‌ఛార్జ్‌తో తమకు ఎటువంటి విభేదాలు లేవన్నారు.