
అధికారంలో భాగస్వామ్యమే లక్ష్యం: గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు
ప్రకాశం న్యూస్, మార్కాపురం: అధికారంలో భాగస్వామ్యం పొందడమే గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు అన్నారు. సోమవారం మార్కాపురం పట్టణంలోని ప్రతిభ కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు లింగంగుంట్ల రామలింగం అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సామాన్యుడి చేతిలో అధికార పగ్గాలు ఉండాలన్న సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు భీమ్‌రావు యశ్వంత్ అంబేద్కర్ సాక్షాత్తు స్థాపించిన పార్టీ గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ అని అన్నారు. ధనవంతులు, దోపిడీదారులు, నేరగాళ్లు రాజకీయాన్ని ఉపాధిగా ఎంచుకొని సామాన్యుడిని చట్టసభలకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడి ఓటింగ్ శాతం ఎంత ఉందో అధికారంలోనూ సామాన్యుడి వాటా అంత ఉండాలని, సామాన్యుడిని చట్టసభలకు పంపించడమే ధ్యేయంగా స్థాపించిన ఈ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఆగస్టు 20 నుంచి డిసెంబర్ 29 వరకు కొనసాగుతుందని, సభ్యత్వ కార్యక్రమంలో భాగంగానే మార్కాపురంలో పర్యటించినట్లు తెలిపారు. అంబేద్కర్ వారసత్వం నాయకత్వంలో కొనసాగుతున్న గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ రానున్న ఎన్నికల నాటికి బలమైన పార్టీగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. త్వరలో సభ్యత్వ కార్యక్రమాలు పూర్తి చేసి మార్కాపురంలో అంబేద్కర్ మనవడి ద్వారా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది దార్ల రత్నం తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది అబ్దుల్ సలాం, ముస్లిం మైనార్టీ నాయకులు పల్నాటి రెహమాన్, జి.వెంకటేశ్వర్లు, లింగాల శీను, కాశీశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కర పత్రికను ఆవిష్కరించారు.