తిరుమలలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించిన ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: కలియుగ దైవం, తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడాలని మార్కాపురం నియోజకవర్గ వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం తిరుమలలో వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పాప ప్రక్షాళన ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించారు. తిరుమలలో ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అబద్దపు ప్రచారాలకు తెరదీస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలకు స్వామి వారిని వాడుకోవడం మంచి కాదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా కూటమి నేతలు తమ తప్పు తెలుసుకుని స్వామి వారిని క్షమించమని కోరుకోవాలని ఆయన పేర్కొన్నారు.