దొనకొండకు.. ఎందుకీ శాపం!!

Please Share This Post

దొనకొండకు.. ఎందుకీ శాపం!!

రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కాబోతుందని దొనకొండ పేరు మారుమోగిపోయింది. పదేళ్లు గడిచిపోయినా దొనకొండలో ప్రభుత్వ పరంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పారిశ్రామిక కారిడార్‌ అంటూ నెలకోసారి హడావుడి తప్ప, ఆచరణలో మాత్రం అడుగు ముందుకు సాగలేదు. చారిత్రక విమానాశ్రయం, దొనకొండ నడిబొడ్డున రైల్వేస్టేషన్‌, వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా దొనకొండకు ఇవేవీ అక్కరకు రావడం లేదు. అందుకు కారణం అరువొచ్చిన నేతలే ఈ ప్రాంతాన్ని పాలించడం. స్థానిక నేతల రాజకీయ స్వార్థం కావొచ్చు, పోరాటం చేతగాని తనమూ కావొచ్చూ.. వెరసి దొనకొండకు శాపంగా మారింది.

మొన్న జగన్‌ హయాంలో కానీ, ఇప్పుడు చంద్రబాబు పాలనలో కానీ దొనకొండ సవతి తల్లి ప్రేమను ఎదుర్కొంటున్నది. విమానాశ్రయం అభివృద్ధి గానీ, సాగర్‌ జలాలు గానీ, వెలుగొండ కెనాల్‌ గానీ, పారిశ్రామిక వాడ గానీ, రాజధాని.. ఇలా ఏ కీలక నిర్ణయంలోనూ దొనకొండకు కనీస ప్రాధాన్యత లేదు. ఈ చిన్నచూపు చాలదన్నట్లు, తాజాగా జిల్లా పునర్విభజనలో దొనకొండకు తీరని అన్యాయం జరిగింది. జగన్‌ హయాంలో జిల్లాల విభజన జరిగినప్పుడు పశ్చిమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, మార్కాపురం, దర్శి, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ హామీకి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, దొనకొండ మండల వాసులెవరూ తమను ప్రకాశం జిల్లాలో ఉంచాలని కోరలేదు. ఆ మాటకొస్తే, జిల్లా ప్రకటన వచ్చే వరకు దర్శి నియోజకవర్గం మార్కాపురం జిల్లాలో లేదనే విషయమే తెలీదు. ఈ కురిచేడు, దొనకొండ మండలాల నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు సుమారు 100 కిలోమీటర్ల దూరం వుంది. రవాణా పరంగానూ సరైన బస్సులు లేవు. ఈ మండలవాసులు ఒంగోలు వెళ్లి రావడం కష్టమైన పని. వీరికి అన్ని విధాలా అనుకూలం మార్కాపురం జిల్లానే.

ఇవేవీ పట్టించుకోకుండా ఈ మండలాలను ప్రకాశంలోనే కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా అన్యాయం. ముఖ్యంగా దొనకొండ మండలంలో చాలా గ్రామాలు సుమారు 15 నుంచి 30 కిలోమీటర్లలోపే మార్కాపురానికి దగ్గరగా ఉన్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన దొనకొండ నేతలెవరూ నోరు మెదపకపోవడం దురదృష్టకరం. తమ పదవులు, పార్టీలో ప్రాధాన్యం కోసం పాకులాడుతున్నారే తప్ప రాబోయే తరానికి ఎంత అన్యాయం జరుగుతుందనే విషయాన్ని విస్మరించారు. తమ పార్టీ నేతలతో కానీ, అధికారులతో కానీ ఈ విషయంపై గట్టిగా మాట్లాడి, పోరాడే శక్తి కోల్పోయారు. ఆ ప్రయత్నం చేస్తే తమ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనని డూడూ బసవన్నల్లా మారిపోయారు. ఈ మండలాల నేతల బలహీనత గమనించిన నేతలు వారి స్వార్థం కోసం ఈ విషయంలో కనీస చర్చ, ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా దొనకొండ, కురిచేడు మండలాలను ప్రకాశం జిల్లాలో కొనసాగేలా చేశారు. ఇలాంటి చావచచ్చిన వారిని నమ్ముకుంటే లాభం లేదు. ఈ రెండు మండలాల ప్రజలంతా ఏకమై ఈ అన్యాయంపై నిరసన గళం విన్పించాలి. తమ అభ్యంతరాలు, సమస్యలను తెలుపుతూ పెద్ద ఎత్తున వినతులు అందజేసి న్యాయం కోసం పోరాడాలి. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలిపే వరకు పోరాట గళం వినిపించాలి.

#Donakonda ను #మార్కాపురం జిల్లాలో కలపాలి”

ALL THE BEST

– వవెరా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *